Home Cinema స్పెష‌ల్ స్టోరి: 100 కోట్ల క్ల‌బ్ హీరోలెంద‌రు?

స్పెష‌ల్ స్టోరి: 100 కోట్ల క్ల‌బ్ హీరోలెంద‌రు?

వంద కోట్ల క్ల‌బ్‌లో టాప్‌ హీరోస్‌

మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ న‌టించిన `గజిని` తొలి వంద కోట్ల క్ల‌బ్ సినిమా. ఈ సినిమా గీటురాయిగా ఇత‌ర అగ్ర హీరోలంతా ప్ర‌తి సినిమా వంద కోట్లు కొల్ల‌గొట్టాల‌ని టార్గెట్లు పెట్టుకున్నారు. అయితే అది నిన్న‌టి మాట‌. బాలీవుడ్ ఏనాడో 100కోట్ల క్ల‌బ్ ని అధిగ‌మించి 500 కోట్ల రేంజుకు చేరుకుంది. అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్.. ప్ర‌భాస్ న‌టించిన‌ `బాహుబ‌లి` ఫ్రాంఛైజీ సినిమాలు స‌రికొత్త ట్రెండ్ సెట్ట‌ర్స్. త‌రువాత  ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోల టార్గెట్ మారింది. ద‌క్షిణాదికి వ‌స్తే వంద కోట్ల క్ల‌బ్ అనేది తెలుగు హీరోల‌కు అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఇక్క‌డ‌ వంద కోట్ల హీరో అనిపించుకోవాల‌ని తాప‌త్ర‌య ప‌డ‌ని అగ్ర‌హీరో లేడు అంటే అతిశ‌యోక్తి కాదు. పైకి క‌లెక్ష‌న్లు ప‌ట్టించుకోమ‌ని, ఆ లెక్క‌లే మాకు అర్థం కావ‌ని, అవి నిర్మాత‌లు చూసుకుంటార‌ని మీడియా ముందు స‌న్నాయి నొక్కులు నొక్కే స్టార్ హీరో నాలుగు గోడ‌ల మ‌ధ్య మాత్రం వంద కోట్ల క్ల‌బ్ ఎప్పుడు సాధించాలా అన్న త‌ప‌న‌తోనే ఉంటారు.

ఈ ఫీట్‌ని ద‌క్షిణాదిలో తొలిసారి అధిగ‌మించిన హీరో ప్ర‌భాస్‌. కేవ‌లం `బాహుబ‌లి` తెలుగు వెర్ష‌న్‌తోనే ఈ ఫీట్‌ని సాధించి అంద‌నంత ఎత్తుకి చేరుకున్నారు. బాహుబ‌లి1, బాహుబ‌లి 2, సాహో చిత్రాల‌తో వంద కోట్ల క్ల‌బ్ అధిగ‌మించిన‌ హీరోగా వెలిగిపోతున్నాడు ప్ర‌భాస్. ఈ రేస్‌లో ప్ర‌భాస్‌ని ఇప్ప‌ట్లో కొట్టే హీరో లేడు. దాంతో స్టార్ హీరోలంతా వంద కోట్లు అంత‌కు మించిన క్ల‌బ్ ల‌పై క‌న్నేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `సరైనోడు` వంద కోట్లు కొల్ల‌గొట్టింద‌ని బాగానే క‌వ‌ర్ చేసే ప్రయ‌త్నం చేశారు కానీ ట్రేడ్ పండితుల్ని మాత్రం మ్యానేజ్ చేయ‌లేక‌పోయారు. పేరుకి త‌ప్ప‌ నిజానికి `స‌రైనోడు` వంద కోట్లు సాధించ‌లేదు.. 90కోట్ల మార్క్ లో స‌రిపుచ్చుకుందని ట్రేడ్ విశ్లేషించింది. ప‌దేళ్ల విరామం త‌రువాత బ‌రిలోకి దిగిన చిరు `ఖైదీ నంబ‌ర్ 150`తో 100 కోట్ల షేర్ వ‌సూళ్లు ద‌క్కించుకున్నారు.

నిజంగా వంద కోట్ల హీరోలున్నారా?

ఆ త‌రువాత జెన్యూన్‌గా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిన హీరో ఎవ‌రైనా వున్నారా అంటే అది రామ్‌చ‌ర‌ణ్ మాత్ర‌మే. `రంగ‌స్థ‌లం` నిజాయితీగా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను, ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత వంద కోట్ల క్ల‌బ్‌పైక‌న్నేసినా దాన్ని చేరుకోలేక‌పోయాయి. సైరా, అల వైకుంఠ‌పుర‌ములో, ఆర్ ఆర్ ఆర్ ఈ రేసులో ముందున్నాయి. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పాన్ ఇండియా సినిమా `సైరా-న‌ర‌సింహారెడ్డి` మ‌రోసారి ఈ ఫీట్‌ని అధిగ‌మించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మిగ‌తా హీరోలు ఈ రేసులోనే లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ నెల‌కొంది. త‌దుప‌రి చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ న‌టిస్తున్న ఆర్.ఆర్.ఆర్ భారీ పాన్ ఇండియా చిత్రం. అలాగే ప్ర‌భాస్ న‌టిస్తున్న జాన్ చిత్రం పాన్ ఇండియా బేస్. ఇవ‌న్నీ వంద కోట్ల క్ల‌బ్ ని అధిగ‌మించి దేశ‌వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ