fbpx
Home Cinema సంక్రాంతికి సిస‌లైన‌ పందెం కోళ్లు ఢీ అంటే ఢీ

సంక్రాంతికి సిస‌లైన‌ పందెం కోళ్లు ఢీ అంటే ఢీ

సంక్రాంతి స‌మ‌రం ఇద్ద‌రి మ‌ధ్యేనా?

టాలీవుడ్‌లో సెంటిమెంట్‌ల‌కు పెద్ద పీట వేస్తార‌న్న విష‌యం తెలిసిందే. ఇక పండ‌గ సీజ‌న్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో సంక్రాంతి సీజ‌న్ లో వ‌చ్చే సినిమాల‌కు ఉండే క్రేజే వేరు. తెలుగు వారికి పెద్ద పండ‌గ కావ‌డంతో ఈ సీజ‌న్‌లో సినిమాల హంగామా మామూలుగా వుండ‌దు. స్టార్ హీరోల ద‌గ్గ‌రి నుంచి కుర్ర హీరోల వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక ద‌ర్శ‌క నిర్మాతలు కూడా ఈ పండ‌గ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని పోటీప‌డుతూ త‌మ చిత్రాల‌ని సిద్ధం చేస్తుంటారు.

ఈ నేప‌థ్యంలో రానున్న సంక్రాంతికి అప్పుడే పోటీ డిసైడ్ అయిపోయింది. ఇద్ద‌రు అగ్ర హీరోలు త‌మ సినిమాల‌తో పోటీకి సై అంటూ అప్పుడే సైర‌న్ మోగించేశారు. ఆ ఇద్ద‌రు హీరోలు మ‌రెవ‌రో కాదు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ధ్య‌నే అస‌లైన పోటీ. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌, మ‌హేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ సినిమాతో రాముల‌మ్మ విజ‌య‌శాంతి రీఎంట్రీ ఇస్తుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అధికారికంగా తేదీని ప్ర‌క‌టించ‌క‌పోయినా చిత్ర బృందం మాత్రం ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి రోజైన‌ జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌ని డేట్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది.

సై అంటే సై అంటున్నారే!

దీనితో పాటు రెండు రోజుల ముందుగానే అంటే జ‌న‌వ‌రి 12న‌ బ‌న్నీ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది.  జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌రువాత త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా `అల వైకుంఠ‌పుర‌ములో`. భారీ హంగుల‌తో సిద్ధ‌మ‌వుతున్న ఈ సినిమాపై కూడా భారీగానే అంచ‌నాలున్నాయి. ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌టం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీంతో పెద్ద హీరోలు న‌టిస్తున్న రెండు చిత్రాల మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. వీటితో పాటు బాల‌కృష్ణ‌, ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమాలు, ప‌లువురు యువ‌క‌థానాయ‌కులు న‌టించిన సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. అయితే ప్ర‌ధాన పోటీ మాత్రం మ‌హేష్, బ‌న్ని మ‌ధ్య ఫిక్స‌యిన‌ట్టేన‌ని అభిమానులు భావిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ