Home Cinema టాలీవుడ్ మీడియాపై వీళ్ల‌ కుట్ర నిజ‌మా?

టాలీవుడ్ మీడియాపై వీళ్ల‌ కుట్ర నిజ‌మా?

టాలీవుడ్ మీడియాలో అన్ వాంటెడ్ వార్!

టాలీవుడ్‌లో చాలా విభాగాల్ని త‌మ చెప్పు చేత‌ల్లోకి తెచ్చుకుని ఆటాడుతున్న ఆ న‌లుగురు లేదా ఆ ప‌దిమంది లేదా నిర్మాత‌ల గిల్డ్ ఇప్పుడు మీడియాను అదుపు చేయాల‌ని అనుకుంటోందా? అంటే అవున‌నే గ‌త కొంత‌కాలంగా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. మీడియాని త‌మ చెప్పు చేత‌ల్లో వుంచు కోవాల‌ని చాలా కాలంగా బ‌డా నిర్మాత‌లం అని చెప్పుకునే కొంత మంది ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. అలా కుద‌ర‌ని ప‌క్షంలో సొంతంగా నిర్మాత‌ల మండ‌లి త‌రుపున నిధుల‌ను స‌మీక‌రించి తామే ఓ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛానెల్ ని ప్రారంభించి దానికి మాత్ర‌మే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని అప్ప‌ట్లో ఓ బ‌డా నిర్మాత, మాజీ నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు పెద్ద స్కెచ్చే వేయ‌డంపై మీడియాలో ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగింది. కానీ దానికి చిన్న నిర్మాత‌లెవ‌రూ సుముఖ‌త వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో ఆ నిర్ణ‌యం బెడిసికొట్టింది. ఇప్ప‌టికీ తాము ఆశించిన ఆధిప‌త్య ప్ర‌తాపం కార్య‌రూపం దాల్చ‌లేదు.

దాంతో ఎలాగైనా మీడియాను క‌ట్ట‌డి చేయాల‌ని యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ పేరుతో ఎల్‌ఎల్‌పి అని పేరు పెట్టుకుని ఓ స‌మూహంగా ఏర్ప‌డ్డారు. ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌లైంది. `మీడియా కంట్రోల్` అనే నినాదంతో మీడియాలో వున్న కొంత మందిని డ‌బ్బు వెద‌జ‌ల్లి త‌మ‌వైపు తిప్పుకుని కొత్త‌గా ప్ర‌వేశిస్తున్న మీడియాల్ని.. యూట్యూబ్ చానెళ్ల‌ను.. లేదా చిన్నా చిత‌కా మీడియాలన్నిటినీ క‌ట్ట‌డి చేయించ‌డం మొద‌లుపెట్టారు. అందుకు కొంద‌రు మీడియా పెద్ద‌లే స‌హ‌కారం అందిస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. సినీ నిర్మాణ రంగంలో.. పంపిణీ రంగంలో తాము ఆడేదే ఆట‌గా ద‌శాబ్ధాల పాటు హ‌వా సాగిస్తున్న పెద్ద‌న్న‌లు కాస్తా ఇప్పుడు మీడియా ఆధిప‌త్యానికి గండి కొట్టే ప్లాన్ చేయ‌డం విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇక్క‌డ కొత్త‌గా ఎవ‌రైనా ఎద‌గాల‌న్న ఆలోచ‌న చేస్తే అది అంత సులువేమీ కాదు. ఇక్క‌డ తాము త‌యారు చేసుకున్న ఓ సిండికేట్ వ్య‌వ‌స్థ‌ త‌ప్ప మ‌రొక‌రు క‌నిపించ‌కూడ‌దనే ప్లాన్ పారిన‌ట్టే.. ఇప్పుడు మీడియాలోకి మ‌రొక‌రు రాకూడ‌ద‌ని.. తోక మీడియాల్ని క‌ట్ చేయాల‌ని.. మీడియ‌లో పెద్ద‌న్న‌లుగా చెప్పుకుంటున్న వారిని ప‌క్క‌న చేర్చుకుని కొత్త నాట‌కానికి తెర‌లేప‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఈ తంతుపై గ‌త కొన్ని నెల‌లుగా మీడియా వ‌ర్గాల్లో వాడి వేడిగా చ‌ర్చ జ‌రుగుతూనే వుంది. మీడియా నియంత్ర‌ణ‌, మీడియాలో పెద్ద‌న్న‌లుగా చెప్పుకునే కొంద‌రు బ‌డా నిర్మాత‌ల‌కు స‌రెండ‌ర్ అయ్యి పెత్త‌నం చేలాయిస్తుంటే దీనిపై కొంత మంది బాహాటంగానే గ‌ళం విప్పినా వారిని అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే వున్నాయి. అనుకూలంగా వుంటే ఓక‌లా.. ప్ర‌తికూలంగా ఉంటే ఇంకోలా డీల్ చేస్తూ స‌రికొత్త ఆట‌కు తెర‌తీయ‌డం ప్ర‌స్తుతం వేడెక్కిస్తోంది. ఇదంతా ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ క‌నుస‌న్నల్లో ప‌రోక్షంగా జ‌రుగుతుండ‌టం టాలీవుడ్ మీడియాపై పెరుగుతున్న అణ‌చివేత ఆధిప‌త్య ధోర‌ణికి అద్దంప‌డుతోంది. దీనికి వ్య‌తిరేకంగా చిన్న‌ నిర్మాత‌ల్లో.. చాలా మీడియా సంస్థ‌ల్లోనూ వాడి వేడి చ‌ర్చ న‌డుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్లోనూ గిల్డ్ త‌మ ప్ర‌తాపాన్ని చూపించి చిన్న‌ నిర్మాత‌ల్ని పూర్తిగా తొక్కేయాల‌ని ప్లాన్ చేసినా వారంతా సినీరంగంలో ఎన్నో విభాగాల్లో అనుభ‌వం ఉన్న నిర్మాత‌ సి.క‌ల్యాణ్‌ని పెద్ద అండ‌గా ముందుకు తీసుకురావ‌డంతో వారి ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. టాలీవుడ్ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేని విధంగా మీడియాని క‌ట్ట‌డి చేయాల‌ని కుట్ర చేస్తున్న వారిలో ఇప్ప‌టికైనా మార్పు రావాల‌ని మీడియా వ‌ర్గాల్లోనే వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ