అందాలతార కియారా అద్వానీ తాజాగా ‘ఇందూ కీ జవానీ’ చిత్రంలో నటిస్తోంది. ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా నచ్చిన భాగస్వామిని ఎంచుకునే అమ్మాయి పాత్రలో ఈ చిత్రంలో కనిపించనుంది. డేటింగ్ యాప్స్ గురించి కియారా చెబుతూ…”ఆన్లైన్ డేటింగ్ సంస్కృతి ని నేను నమ్మను. వీటితో అవతలి వ్యక్తి ని సరిగా తెలుసుకునే అవకాశం దొరకదు. వాళ్లు ఎంతవరకు నిజాయితీపరులో తెలీదు. కలిసి ప్రయాణం చేస్తేనే వారి మనస్తత్వం అవగతం అవుతుంది. నాకు కాలేజీ రోజుల్లో ప్రేమ ప్రతిపాదనలు చాలానే వచ్చాయి. ఆ వయసులో ఏదో తెలియని ఆకర్షణ సహజం… అందుకే వాటిని అపరిపక్వమైనవిగానే భావించాను. ఎవరినీ ప్రేమించలేదు” అని చెప్పింది కియారా అద్వానీ.
“సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల మనసైన వ్యక్తి గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదనే ఉంది. ఇప్పుడు నేను సింగిల్‌గానే ఉన్నాను. నచ్చిన వ్యక్తి తారసపడితే.. అందరికి ఆ విషయాన్ని వెల్లడిస్తాను. ఆ రహస్యాన్ని దాచిపెట్టుకోను” అని చెప్పింది కియారా . “ఇప్పుడు మంచి స్థాయికి వచ్చా. మరో ఐదేండ్లలో ఉత్తమ నటిగా, అత్యుత్తమ స్థానంలో ఉండాలనుకుంటున్నా’ అని అంటోంది కైరా అద్వానీ. ఈ ఏడాది ‘కబీర్ సింగ్’తో అందరి చూపులను తనవైపు తిప్పుకున్న కైరా బాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . తన సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ..”కబీర్‌సింగ్’ నా కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇటీవల ‘గుడ్‌న్యూజ్’ ప్రమోషన్లో భాగంగా ఛండిఘర్ వెళ్ళినప్పుడు అంతా నన్ను ‘ప్రీతి కబీర్ సింగ్’ అని పిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ చిత్రం నాకు వెలకట్టలేని గుర్తింపునిచ్చింది. నాలో కూడా చాలా మార్పుని తెచ్చింది.
రణ్వీర్ సింగ్, రణ్‌బీర్‌కపూర్, వరుణ్ ధావన్.. మరీ ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ సార్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుంది’ అని చెప్పింది కియారా. నేను నటించిన సినిమాల్లో నాకు కేవలం నా పాత్ర మాత్రమే కనిపిస్తుంది. వేరే పాత్రలు అస్సలు కనిపించవు. సినిమా చూసేటప్పుడు నా పాత్రనే చూస్తా. దీని వల్ల నా తప్పులు తెలుస్తాయి. అవి నా తర్వాతి చిత్రంలో జరగకుండా చూసుకోవచ్చు. అందుకే నా సినిమాలను నేను ఎంజాయ్ చేయలేను” అని తెలిపింది. ప్రస్తుతం కైరా ‘గుడ్‌న్యూస్’, ‘లక్ష్మీబాంబ్’, ‘ఇందూ కీ జవానీ’, ‘భూల్ భులైయ్యా 2’, ‘షేర్షా’ చిత్రాల్లో నటిస్తోంది. వరుణ్ ధావన్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతుంది. భూమి పడ్నేకర్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శషాంక్ ఖైతన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ‘మిస్టర్ లేలే’ అనే పేరును ఖరారు చేశారు.