పార్లమెంట్ లో కార్యాచరణపై టీడీపీ పార్టీ సమావేశం

Tdp parliamentary party meeting

కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 19 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ ‘ఓం బిర్లా’ తెలిపారు. ఈ క్రమంలో పార్లమెంట్ లో కార్యాచరణ మీద చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. విశాఖ స్టీల్ ఫ్లాంట్, పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల నిధులు అంశాలను పార్లమెంట్‌ సాక్షిగా ఉద్యమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కృష్ణా జలాలపై జరుగుతున్న వివాదాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుతున్నట్లు నటిస్తూ వైసీపీ నేతలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌ కోసం రాజీనామాలకు తాము సిద్ధమని రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. జగన్ ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయని, అందుకే జల వివాదంపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పోరాడి సాధిస్తామని రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. రాఘురామపై అనర్హత వేటు వేయించేందుకే వైసీపీ ఎంపీలు శక్తినంతా కూడగడుతున్నారని, రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీ పట్టడం లేదన్నారు రామ్మోహన్‌ నాయుడు.అంతర్‌ రాష్ట్ర జల వివాదంపై కేంద్రం జోక్యం కోరుతామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ చెప్పారు. ఆస్తుల పరిరక్షణ, స్వలాభం కోసం జగన్‌ ఆడుతున్న నాటకాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర హాజరైనారు.