సీఎం జగన్ కు చినబాబు లేఖాస్త్రం

Nara lokesh wrote a letter to cm jagan over job callender issue

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మీద నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో నిరసన పోరాటాలు చేస్తున్నారు. వారి ఆగ్రహ జ్వాలలు జగన్ సర్కారుని బాగానే తాకుతున్నాయి. పలు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి యత్నించగా పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

Nara lokesh wrote a letter to cm jagan over job callender issue

ఈ నేపథ్యంలో నిరుద్యోగ అంశం మీద సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలంటూ లోకేష్ లేఖలో సీఎంను కోరారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌లు పరిష్కరించకపోతే మ‌రో పోరాటానికి టిడిపి సిద్ధమని, ఉత్తుత్తి ఉద్యోగాల డూబు క్యాలెండ‌ర్‌తో నిరుద్యోగుల్ని నిలువునా ముంచారని, మోసపూరిత జాబ్ క్యాలెండ‌ర్ ఉప‌సంహ‌రించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

పాదయాత్రలో జగన్ వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలని సూచించారు. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి 30 రోజుల్లో మెగా డిఎస్‌సి నోటిఫికేష‌న్ ఇవ్వాలని, ఇంజనీరింగ్ విభాగాలలో 20,000 వేల‌కు పైగా ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలని తెలిపారు. 6500+కి పైగా ఖాళీగా వున్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని, రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పేర్కొన్నారు.

జాబ్ క్యాలెండ‌ర్ చూసి మోసపోయిన నిరుద్యోగులు నిరసనకి దిగితే పోలీసులు అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా వున్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో నిరుద్యోగుల‌కిచ్చిన 2000 నిరుద్యోగ భత్యాన్ని పున‌రుద్ధ‌రించాలని లోకేష్ డిమాండ్ చేశారు.