వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. కనిపిస్తున్నాయా జగన్ సారూ.!

రెండున్నరేళ్ళ పాలన తర్వాత వైసీపీలో అంతర్గతంగా కుమ్ములాటలు కనిపించడం సహజమే. పదవుల కోసమో, లేదంటే ఇంకో అసహనమో.. కారణమేదైతేనేం, నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య వివాదం నడుస్తోంది. ఇది ఏ ఒక్క చోటుకో పరిమితం కాదు. అయితే, ఎప్పటికప్పుడు సరికొత్త పదవులు సృష్టిస్తూ వీలైనంతవరకు పార్టీలో అసంతృప్తి సెగలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు వైసీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అయినాగానీ, కింది స్థాయిలో కుమ్ములాటలు ఆగకపోవడంతో వైసీపీలో రోజురోజుకీ అలజడి మరింత పెరిగిపోతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీకే చెందిన చేజెర్ల సుబ్బారెడ్డి తీవ్రస్థాయి ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా వైసీపీ అధిష్టానం ఉలిక్కిపడింది.

అంగన్వాడీ పోస్టులదగ్గర్నుంచి, మండల కన్వీనర్ల వరకు పదవుల్ని అమ్మేసుకుంటున్నారన్నది ఎమ్మెల్యే మీద వైసీపీ నేత సుబ్బారెడ్డి చేస్తున్న ఆరోపణల సారాంశం. ఎంపీపీ పదవుల్ని అమ్మకున్నారనీ, జెడ్పీటీసీ టిక్కెట్ కోసం 50 లక్షలు నొక్కేశారనీ, ఫిక్స్‌డ్ రేట్ల ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మారిపోయారనీ సుబ్బారెడ్డి ఆరోపించడం గమనార్హం.

అన్నట్టు, ఈ మధ్యనే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటరీ నియోజవకర్గంలో ఎంపీ భరత్ అలాగే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఆధిపత్య పోరు నడవడం, ఇరువురూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం తెలిసిన సంగతే. ఆ పంచాయితీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళాక కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

అంతకు ముందు గుంటూరు జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రచ్చ జరిగింది. నెల్లూరు జిల్లా విషయానికొస్తే, ఇక్కడ రచ్చ మామూలుగా లేదు వైసీపీలో. ఎప్పటికప్పుడు సరికొత్తగా నేతలపై ఆరోపణలు పుట్టుకొస్తున్నాయి.. అదీ వైసీపీలోనే, వైసీపీ నుంచే. ఇంతా జరుగుతున్నా, పార్టీ అధిష్టానం ఇలాంటి గొడవలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోలేకపోతోంది.

మిగతా రాజకీయ ఆరోపణలు వేరు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు రావడం వేరు. ఇది పార్టీకి ఖచ్చితంగా చెడ్డపేరు తెచ్చే వ్యవహారం. ప్రభుత్వానికీ ఇది చెడ్డపేరే తెస్తుంది. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి వ్యవహారాల్లో ‘రాజీమార్గాన్ని’ అనుసరిస్తారా.? కఠిన చర్యలకు దిగుతారా.? అన్నది వేచి చూడాల్సిందే.