జగన్ మీదకు ర‌ఘురామ‌ వదిలిన మరో పదునైన లేఖాస్త్రం!

Another letter by Raghuram on Jagan

సొంత పార్టీ మీద న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌ కృష్ణంరాజు చేస్తున్న ఎదురు దాడి గత కొంత కాలంగా చర్చనీయాంశంగా నిలుస్తుంది. అయితే ఆయన తీరుపై ప్రజలు పలురకాలుగా కామెంట్ చేస్తుండటం విశేషం. తాజాగా ఆయన సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని వదులుతున్న లేఖాస్త్రాలు ఏపీలో రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే మొదటి లేఖలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి పెన్షన్ రూ. 250 పెంచుతూ, ఈ నెల నుంచి రూ.2,750 ఇవ్వాలని ర‌ఘురామ డిమాండ్ చేశారు. తాజాగా ఆయన ఈ రోజు మరో లేఖ రాశారు.

Another letter by Raghuram on Jagan

ఆంధ్ర ప్రదేశ్ లో సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానం రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వాగ్దానం గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల్లోనే సీపీఎస్‌ ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేస్తామని జగన్ మాట ఇవ్వడంతోనే ఉద్యోగులందరూ ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించారని ర‌ఘురామ ప్రస్తావించారు . అయితే ప్రభత్వం ఏర్పడి 765 రోజులు దాటినా ఆ హామీ నెరవేర్చలేదని రఘురామ తన లేఖలో జగన్ ను విమర్శించారు.

ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన అనంత‌రం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది విడుద‌లైన ర‌ఘురామ‌ కృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వ తీరుపై మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు లేఖలు రాయటం తెలిసిన విషయమే. అయినప్పటికీ తాజాగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ఆయనకే లేఖాస్త్రాలు సంధించి సీఎం, వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లుగా అర్ధమవుతుంది. ర‌ఘురామ అడుగుతున్న వాటిలో తప్పు లేదని కొందరు సపోర్ట్ చేస్తుండగా, ఇదంతా జగన్ మీద కక్షసాధింపని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.