రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాల్లో కోత!

కరోనా ఎఫెక్ట్‌‌తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆదాయం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తోరెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోతల దిశగా ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగుల జీతాలకు కోత వేయనున్నాయి.

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అలాగే పేదలకు నగదు పంపిణీ నిర్ణయంతో అదనపు భారం కూడా పడింది. లాక్ డౌన్‌తో ఆదాయం శూన్యం కాగా.. ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ధనిక రాష్ట్రం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కేంద్రం నుండి పన్నుల వాటాగా రావాల్సిన నిధులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 30 శాతం కోత విధించేందుకు నిర్ణయం తీసుకోగా.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఈనెల జీతాలు ఇవ్వకూడదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు సమాయాత్తమవుతున్నారు. అయితే కరోనా సేవల్లో ఉన్న వైద్య ఆరోగ్య, పోలీస్, మున్సిపల్ శాఖల సిబ్బందికి మాత్రం వేతనాలు పూర్తిగా ఇవ్వాలని నిర్ణయిం తీసుకోగా.. ఇది మూడు నెలల పాటు కొనసాగనుందని తెలుస్తోంది. ఈ కట్ చేసిన మొత్తాన్ని తర్వాత విడతల వారీగా తిరిగి ఉద్యోగులకు ఇవ్వాలన్న ప్రతిపాదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.