ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

mekapati gowtham reddy comments on ap local body elections

ఆంధ్ర ప్రదేశ్ : ఈ ఏడాది మార్చి 7న ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని .. తొలిదశలో 333 జెడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీలకు ఎన్నికలు జరపాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వద్ద స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే 2129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

mekapati gowtham reddy comments on ap local body elections
mekapati gowtham reddy comments on ap local body elections

అయితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ తప్పు పట్టింది. ఆ తర్వాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించి మరొకరిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై రమేష్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో.. మళీ ఆయన ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల హైకోర్టులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై చర్చ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన అన్నారు. డిసెంబర్‌లోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న మంత్రి గౌతమ్ రెడ్డి.. ఏ వైరస్ అయినా రెండు, మూడు సార్లు వస్తుందని తెలిపారు. నవంబర్, డిసెంబర్ పరిస్థితిని చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన వెల్లడించారు. బీహార్‌లో శాసనసభ ఎన్నికలు తప్పనిసరి కాబట్టి.. అక్కడ ఎన్నికలను నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉందని గౌతమ్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. మరోవైపు గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయిందని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ఎస్‌ఈసీకి ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.