మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ లేకుండా సబ్బం హరి అస్తమానం ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు జగన్ వ్యతిరేకులకు ఇది బాగా పనికొస్తోంది.
ఒకప్పుడు జగన్‌కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న సబ్బం హరిని.. ఉన్నట్లుండి జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. అత్యంత అవమాన కర రీతిలో తనను తొలగించారని ఆరోపిస్తూ.. అప్పటి నుండి సబ్బం హరి తన కోపాన్ని బహిరంగంగానే బైటపెడుతున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రాన్ని జగన్ ఉగాండా మాదిరిగా మార్చేశారని సబ్బం హరి చేసిన కామెంట్స్ వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రాష్ట్రాన్ని కరోనా కోరల నుండి కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే.. సబ్బం హరి ఇలంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పైగా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా.. వారు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ కుటుంబం వల్ల అత్యున్నత పదవులు పొందిన సబ్బం హరిని నమ్మి జగన్ పార్టీకి సంబంధించి ఎంతో ముఖ్యమైన విషయాలు చెబితే వాటిని టీడీపీకి చేరవేశాడని, అందుకే సబ్బం హరిని దూరం పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. మరి దీనిపై హరి ఎలాంటి సమాధానం ఇస్తారో గానీ.. ప్రస్తుతానికి అయితే జగన్ ఓ నియంత అని, తాను దగ్గరుండి అన్నీ చూశానని అంటూ.. నిత్యం ఏదో ఒక వ్యాఖ్యతో ఆయన జగన్ వ్యతిరేక వర్గానికి మంచి ఎంటర్టైన్ మెంట్ గా మారిపోయారు.