ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఒకడు.
అలా వుంది పరిస్థితి. జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కలిసి నడవబోతున్నాయట.! అలాగని జనసేన అధినేత సంకేతాలు పంపేశారు.
టీడీపీ అధినేత ఎప్పటినుంచో జనసేన మీదకి వలపు బాణాల్ని సంధిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఎన్ని సీట్లు.? జనసేనకి ఎన్ని సీట్లు.! ఇది గెలిచే సంఖ్యకు సంబంధించిన విషయం కాదు. పోటీ చేసే సీట్లకు సంబంధించిన వ్యవహారం.
ముందైతే కలిసి పోటీ చేస్తారా.? లేదా.? అన్నదానిపై ఇరువురూ తొలుత ప్రకటించాలి. అధికారిక ప్రకటన వచ్చాక, సీట్ల పంపకాలపై చర్చలుంటాయ్.
కాదు కాదు, సీట్ల పంపకాలతో చర్చ తర్వాతే, పొత్తులపై ప్రకటన వస్తుందన్న వాదనా లేకపోలేదు. ఎవరి గోల వారిదే.! జనసేనకు పది నుంచి పదిహేను సీట్ల కంటే ఎక్కువ ఇవ్వడం శుద్ధ దండగ..
అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్ళు. ఆ మాత్రం కూడా టీడీపీకి సీన్ లేదంటూ జనసైనికులు ఎద్దేవా చేస్తున్నారు.
తెలుగు తమ్ముళ్ళు, జనసైనికులు.. కలిసి పనిచేసే పరిస్థితిని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ సృష్టించాలి. ఆ దిశగా తమ తమ పార్టీ శ్రేణుల్ని నడిపించాలి, బుజ్జగించాలి.. చైతన్యపరచాలి.
దానికి, పెద్దగా సమయం పట్టకపోవచ్చు.. అయితే, ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్యా సరైన అవగాహన వుండాలి.. నాయకులకీ చిత్తశుద్ధి వుండాలి.
అదెలాగూ ఆ రెండు పార్టీల్లో వుండదని అధికార వైసీపీ బలంగా నమ్ముతోంది.
‘టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే 175 సీట్లు వస్తాయ్.. విడివిడిగా పోటీ చేసినా 175 సీట్లు వస్తాయ్..’ అంటోంది వైసీపీ.