సాధారణంగా రోడ్లమీద వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కు చేస్తూ ఉంటారు. అయితే పోలీసులు ఇలా నిషిద్ధ ప్రదేశాలలో ఉంచిన వాహనాలను తొలగించమని వాహనదారులను ఆదేశిస్తూ ఉంటారు.
కొంతమంది ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు ఆ ప్రదేశం నుండి వాహనాలను తీయగా మరి కొంతమంది మాత్రం పోలీసులకు భయపడకుండా వారికి ఎదురు తిరుగుతూ ఉంటారు.
తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫ్రీ లెఫ్ట్‌లో కారును అడ్డు తొలగించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పటంతో
ఆగ్రహించిన వాహనదారుడు తన కారుతో కానిస్టేబుల్ కాలును తొక్కించడమే కాకుండా దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే…బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని తాజ్‌కృష్ణా జంక్షన్లో ఓ కారు డ్రైవర్ ఫ్రీ లెఫ్ట్‌లో కారు నిలపడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
దీంతో అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎల్.నగేష్ ఫ్రీ లెఫ్ట్‌లో ఉంచిన కారు అడ్డు తొలగాలని వాహనదారుడికి సైగలు చేశాడు.
అయినాసరే సదరు వాహనదారుడు వినిపించుకోలేదు. దీంతో కానిస్టేబుల్ వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్లి కారు తీయమని చెప్పగా
ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ కాలుపైకి కారును పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా కారులో నుండి కిందకు దిగి కోపంతో సదరు కానిస్టేబుల్ మీద పిడిగుద్దులతో దాడి చేసి చెప్పుతో కొట్టాడు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ బట్టలు కూడా చిరిగాయి. వాహనదారుడు చేసిన దాడిలో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలు అయ్యాయి . దీంతో సదరు కానిస్టేబుల్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి సదరు వహదరుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.