‘వాడు నా తమ్ముడు.. నా బిడ్డ. రాజకీయంగా వాడు ఉన్నత స్థానంలో వుండాలని నేను కోరుకుంటే తప్పేంటి.? నేనైతే రాజకీయాల్లో లేను, మళ్ళీ రాజకీయాల్లోకి రాను..’
అంటూ మెగాస్టార్ చిరంజీవి, తన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించారు.
జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో రోజా మీద కావొచ్చు, పరోక్షంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కావొచ్చు..
చిరంజీవి కొంత ఆసక్తికరమైన, కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆయా ప్రశ్నలకు చిరంజీవి స్పష్టంగా సమాధానమిచ్చారంతే.
తన తమ్ముడ్ని వెనకేసుకొచ్చినట్లు కూడా కనిపించింది. తన మీద రోజా చేసిన విమర్శల్నీ తిప్పి కొట్టినట్లయ్యింది.
‘మా ఇంటికి వచ్చారు.. నచ్చినవి వండించుకుని తిన్నారు.. మా ఇంట్లో మనుషుల్లా కలియతిరిగారు. కానీ, బయటకు వెళ్ళాక విమర్శలు చేస్తారు. ఇదేం రాజకీయం.?’
అంటూ చిరంజీవి, నేరుగా రోజా మీద మండిపడ్డారు. రోజా ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో వచ్చిన ఓ ప్రశ్నకు చిరంజీవి సమాధానమిచ్చే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన వస్తే.. ‘ఎవరెవరో ఏవేవో అంటుంటారు. ప్రజలకు అన్నీ తెలుసు..’ అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదేనా.?
అంటే, ప్రశ్న అడిగింది జగన్ ప్రస్తావన తీసుకు రావడం ద్వారానే గనుక.. చిరంజీవి తన ఉద్దేశ్యాన్ని జగన్‌కి తెలిసేలా చెప్పకనే చెప్పారని అనుకోవచ్చు.
అయితే, రాజకీయాలకు సంబంధించి ‘నా దారి నాదే..’ అని చిరంజీవి చెప్పేశారు. ‘రాజకీయాలకు సంబంధించి ఏ తలనొప్పీ నాకు వద్దు. నా అభిమానులకూ ఈ విషయమై నేనేమీ చెప్పను..’
అనేశారు చిరంజీవి. ‘వాడి మీద వచ్చే విమర్శలకు వాడే సమాధానం చెప్పుకుంటాడు. నన్ను అందులోకి లాగొద్దు’ అని కూడా ఓ ప్రశ్నకు బదులిచ్చారు చిరంజీవి.