సంక్షేమం సరిపోదు.. రోడ్లు కావాలి.! జగన్‌కి జనం ఝలక్.!

2024 ఎన్నికలకు ఎంతో దూరంలో లేదు. ‘వై నాట్ 175’ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నిజమే, విపక్షాలేవీ అంత బలంగా లేవు.

టీడీపీ పరిస్థితి ఆరిపోయే దీపంలా వుంది. జనసేన పార్టీకి ఓ జెండా, ఎజెండా అన్నవి లేనట్టుంది పరిస్థితి. బీజేపీని జనం నమ్మరు.. కాంగ్రెస్ పార్టీని లెక్క చేయరు.

సో, ఎలా చూసినా వైసీపీకే మళ్ళీ అధికారం దక్కుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందులో నిజం లేకపోలేదు కూడా. కానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

అసలు రాష్ట్రంలో ప్రజలేమనుకుంటున్నారు.? ఈ విషయమై వైసీపీ అధినాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.

సంక్షేమంలో వైసీపీ పాలనకు వంక పెట్టడానికేమీ లేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా, ‘బటన్ నొక్కుడు’ వ్యవహారానికి ఎలాంటి ఇబ్బందీ వుండటంలేదు.

లబ్దిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళుతున్నాయి. ఆ విషయంలో లబ్దిదారులంతా హ్యాపీ.

ఆ లబ్దిదారులంతా ఓట్లేస్తే చాలు, తాము ఇంకోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ అంటోంది. అదే జరిగితే, వైసీపీకి తిరుగుండదు.

కానీ, లబ్దిదారులంతా ఓట్లేసేస్తే, తెలుగుదేశం పార్టీనే అధికారంలో వుండాలి. ఎందుకంటే, టీడీపీ కూడా సంక్షేమ పథకాల్ని అమలు చేసింది. అప్పుడూ లబ్దిదారుల సంఖ్య తక్కువేమీ కాదు.

‘సంక్షేమ పథకాలు ఠంచనుగా అందుతున్నాయ్.. ఆ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. కానీ, రోడ్లు బాగా లేవ్.. అభివృద్ధి లేదు..’ అని ఓటర్లు తెగేసి చెబుతున్నారు.

ఇక్కడే, వైసీపీ తమ ఫెయిల్యూర్‌ని అంగీకరించాలి, దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి.

బటన్ నొక్కడానికి తప్ప, ముఖ్యమంత్రి జనాల్లోకి రావడంలేదు’ అన్న విమర్శ కూడా జనం నుంచి వినిపిస్తోంది.