ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రోడ్లపై రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సభలు జరగకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర హోం శాఖ.!
ఎవరైనాసరే, ఈ నిర్ణయాల్ని అభినందించి తీరాల్సిందే. నిజంగానే, ఇది అత్యంత సాహసోపేతమైన నిర్ణయం.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇటీవలి కాలంలో 11 మంది మృతికి కారకులయ్యారు పరోక్షంగా.
నెల్లూరు జిల్లా కందుకూరులో, గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యక్రమాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఫలితమది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు తొక్కిసలాటల వల్ల.
‘ఏం, మాకు రాజకీయాలు తెలియదా.? మేం బహిరంగ సభల్ని నిర్వహించలేమా.? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం వుంది నాకు..’
అని చంద్రబాబు బీరాలు పలకడం సంగతి పక్కన పెడితే, రోడ్డు మీద రాజకీయాలేంటి నాన్సెన్స్ కాకపోతే.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
రాజకీయం అంటే సేవ.. అంతేగానీ, జనాల్ని ఇబ్బందులకు గురిచేయడం కాదు. కానీ, రాజకీయాలు నడుస్తున్నదే జనాల్ని ఇబ్బంది పెట్టడానికి.!
అది ఇంకో అడుగు ముందుకెళ్ళి, జనాన్ని మట్టుబెట్టడానికి.. అన్నట్టుగా తయారైంది ఇటీవల జరిగిన తొక్కిసలాటలతో.
ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీల బహిరంగ సభలు, ర్యాలీలకు రోడ్లపై అనుమతి లేదని జగన్ సర్కారు తెగేసి చెబుతోంది.
అయితే, షరతులు వర్తిస్తాయండోయ్.! ఆ షరతులు, వైసీపీకి అనుకూలంగా వుంటాయా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.
రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు జనాల్లోకి వెళ్ళాలి.. రోడ్ షోలు, ర్యాలీలు.. ఈ హంగామా చాలానే వుండబతోంది.
టీడీపీ సహా జనసేనకు షాకిచ్చేలా జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శ వినిపిస్తోంది. ఆ పరిస్థితి రాకుండా, వైసీపీ సైతం రోడ్ల మీద ర్యాలీలు చేయకుండా,
కనీసం తమ ఫ్లెక్సీలు, హోర్డింగులు లేకుండా రాజకీయం చేయగలిగితే వైఎస్ జగన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.