తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, తెలంగాణ సిట్ చేజారింది.
అత్యంత వ్యూహాత్మకంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీని కేసీయార్ ఇరికించారు ఈ ఫామ్ హౌస్ కొనుగోళ్ళ వ్యవహారంలో.. అన్న ఆరోపణలున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీజేపీ గాలం వేయగా, ఆయన ఫామ్ హౌస్ వేదికగా హైడ్రామా నడిచింది.
తెలంగాణ పోలీసులు, బీజేపీ దూతల్ని అరెస్ట్ చేశారు. అయితే, ‘వాళ్ళతో మాకేంటి సంబంధం.?’ అంటూ బీజేపీ తెలివిగా తప్పించుకుంది.
మరోపక్క, ఈ కేసులో బీజేపీ ముఖ్య నేతల్ని ఇరికించేందుకు గులాబీ పార్టీ అస్త్ర శస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తూనే వుంది.
ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం బీజేపీ సీనియర్ నేతలకు శ్రీముఖాలు పంపిన సంగతి తెలిసిందే.
మరోపక్క, ఈ కేసులో అరెస్టయిన నిందితులు, సీబీఐ విచారణను కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది.
దాంతో, ఈ కేసు తెలంగాణ పోలీసుల చేతుల్లోంచి జారిపోయి, సీబీఐ చేతికి చిక్కినట్లయ్యింది.
సీబీఐ అంటే అది కేంద్ర దర్యాప్తు సంస్థ గనుక, గులాబీ పార్టీ అడ్డంగా బుక్కయిపోయినట్లేనని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా బీజేపీ మద్దతుదారులు అరెస్టవుతూ వచ్చారు.
సీబీఐ ఎంట్రీ ఇస్తే, గులాబీ పార్టీ నేతలు అరెస్టవుతారేమో.! అదే జరిగితే, తెలంగాణలో గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.